సీఎం కేసీఆర్ పుట్టిన రోజున నిర్వహించనున్న కోటి వృక్షార్చనలో గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ భాగంకానుంది. ఈనెల 17న తమ శాఖ ఆధ్వర్యంలో మూడు లక్షల మొక్కలు నాటనున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. ఇందులో భాగంగా గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో రెండు లక్షల మొక్కలు, మహిళా శిశు సంక్షేమ శాఖలోని కార్యాలయాల ప్రాంగణాల్లో, అంగన్వాడీలలో లక్ష మొక్కలు నాటుతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన హారితహారం ఫలితాలు ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలకు అందుతున్నాయని వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురియడంతో భూగర్భ జలాలు పెరిగాయని, హరిత హారం ప్రభావం వల్ల కాలుష్యం గణనీయంగా తగ్గిందని పలు సర్వేలు వెల్లడించడం సీఎం ముందు చూపునకు నిదర్శనమని పేర్కొన్నారు.
భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలన్న గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేశారని, దీనిద్వారా ఊర్లన్ని హరిత గ్రామాలుగా మారుతున్నాయని చెప్పారు. నర్సరీలతోపాటు పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి పచ్చదనం పెంచడంతో పాటు ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టిస్తున్నారని చెప్పారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో సెలబ్రెటీలు కూడా భాగస్వాములవుతున్నారని వెల్లడించారు.