ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు ఫిబ్రవరి 17న కోటి వృక్షార్చన అనే బృహత్తర కార్యక్రమంలో అందరం భాగస్వాములం కావాలి. ఆ రోజు ఒక్క గంటలో కోటి మొక్కలు నాటి రికార్డు సృష్టించాలి. హరిత ప్రేమికుడైన కేసీఆర్‌కు పుట్టినరోజు బహుమతిగా అందించాలి. గ్రీన్ ఇండియా చాలెంజ్ సంకల్పం నెరవేరాలని ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ అన్నారు.
తెలంగాణ భావజాలవ్యాప్తి ద్వారా సీఎం కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా దేశవ్యాప్తంగా పచ్చదనం కోసం హరిత భావజాలాన్ని వ్యాపింపజేస్తామని రాజ్యసభసభ్యుడు సంతోష్‌కుమార్ ప్రకటించారు. రాష్ర్టాన్ని, దేశాన్ని పర్యావరణ పరంగా, అత్యంత నివాసయోగ్యంగా మార్చుకొనేందుకు గ్రీన్ చాలెంజ్ ఉపయోగ పడుతుందని ఆదివారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు ఫిబ్రవరి 17న కోటి వృక్షార్చన అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు. ఆ రోజు ఒక్క గంటలో కోటి మొక్కలు నాటి రికార్డు సృష్టించి, హరిత ప్రేమికుడైన కేసీఆర్‌కు పుట్టినరోజు బహుమతిగా ఇవ్వాలనేది గ్రీన్ ఇండియా చాలెంజ్ సంకల్పమని స్పష్టంచేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఇచ్చిన పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నతస్థాయినుంచి కిందిస్థాయి వరకు పార్టీ శ్రేణు లు సమాయత్తమవుతున్నాయని తెలిపారు. స్పీకర్ పోచా రం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, గ్రామస్థాయి వరకు పార్టీ పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎంపీ సంతోష్‌కుమార్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభిమానించే వారందరితోపాటు వ్యాపార, వాణిజ్య, సినిమా, పారిశ్రామిక, క్రీడారంగాల ప్రముఖులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసేందుకు సుముఖత వ్యక్తంచేశారని చెప్పా రు. మంగళ, బుధవారాల్లో శంషాబాద్ విమానాశ్రమంలో హైదరాబాద్ చేరుకొనే ప్రయాణికులందరికీ ఔషధ మొక్కలను గ్రీన్ ఇండియా చాలెంజ్ తరఫున పంపిణీ చేస్తామని తెలిపారు. పల్లెప్రగతి ద్వారా స్వచ్ఛమైన, ఆకు పచ్చ గ్రామాలను సృష్టించాలని, ప్రతి గ్రామానికి ఒక నర్సరీ, ట్రాక్టర్, ట్యాంకర్ వంటి సౌకర్యాలను ప్రభుత్వం అందించిందని గుర్తుచేశారు. ఈ సౌకర్యాలకు సార్థకత ఉండాలంటే ప్రతి గ్రామం, తద్వారా రాష్ట్రం ఆకుపచ్చగా మారాలని ఆకాంక్షించారు. ఇందుకు అందరి సహకారం కావాలని కోరారు. ఎండాకాలం సమీపిస్తున్నందున మొక్కలు నాటడమే కాకుండా, వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ప్రత్యేకంగా విజ్ఞప్తిచేశారు.