ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రారంభమయ్యింది. మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. అనంతరం ఫలితాలను ప్రకటించనున్నారు. మూడో విడుతలో భాగంగా 160 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 26,851 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. మొత్తం 55,75,000 మంది ఓటువేయనున్నారు.
మూడో దశలో భాగంగా 2639 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 7,757 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇప్పటికే 579 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో అదేవిధంగా 31,516 వార్డుల్లో 11,753 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 19,553 వార్డు స్థానాల్లో 43,162 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాగా, పశ్చిమగోదావరి జిల్లాలో రెండు సర్పంచ్, 210 వార్డుల్లో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ వేయలేదు.
4118 సమస్యాత్మక, 3127 అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. దీంతో అక్కడ పటిష్ఠ భద్రతా ఏర్పట్లు చేశారు. ఇక నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ పరిశీలనకు 3025 మంది సిబ్బందిని నియమించారు.