సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను నగరంలోని జలవిహార్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చనలో భాగంగా ఎంపీ కే కేశవరావుతో కలిసి రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ జలవిహార్‌లో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రేరణతోనే గత మూడేండ్లుగా గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఒక్క గంటలో కోటి మొక్కలు నాటాలనే లక్ష్యంతో కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దీనికి మంచి స్పందన వస్తుందని సంతోషం వ్యక్తంచేశారు. తెలంగాణలో అడవులను ఎలా సంరక్షించుకుంటున్నామనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలని ఈ చిన్న ప్రయత్నం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అంతకు ముందు ఎల్బీనగర్ ఎమ్మెల్యే, మూసీ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ సుధీర్ రెడ్డితో కలిసి నాగోల్‌లోని మూసీ తీరంలో మొక్కలు నాటారు.
