విశాఖ ఉక్కు కోసం అసెంబ్లీలో తీర్మానం : ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రం నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకపోతే ఆ పరిశ్రమకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఇప్పటికే ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాసినట్టు గుర్తుచేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు కృషిచేస్తానని హామీఇచ్చారు. బుధవారం విశాఖపట్నంలో ఆ ప్లాంట్‌ పరిరక్షణ కమిటీ ప్రతినిధులతో జగన్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానికి రాసిన లేఖతోపాటు విశాఖ ఉక్కు ప్లాంట్‌కు అవసరమైన ఉక్కు గనులపై సుమారు గంటన్నరపాటు సుదీర్ఘంగా చర్చించారు. గతంలో ఓఎన్‌ఎండీసీతో జరిగిన గనుల ఒప్పందంపై మళ్లీ సమీక్షిస్తామని సీఎం చెప్పారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు పోస్కో వచ్చే అవకాశాలు ఉండవని ఆయన పేర్కొన్నారు.