ఏసీబీ వలలో అసిస్టెంట్‌ లేబర్ ఆఫీసర్ పి.శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ శివ వెంకట కృష్ణ

బీమా డబ్బుల మంజురు కోసం లంచం డిమాండ్‌ చేస్తూ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కథనం మేరకు..కోదాడ పట్టణంలోని ఆజాద్‌నగర్‌కు చెందిన భవన నిర్మాణ కార్మికుడు రామకృష్ణ ఇటీవల మృతి చెందాడు. కాగా, ఆ కుటుంబానికి రావాల్సిన బీమా డబ్బుల కోసం సదరు అధికారులు లంచం డిమాండ్ చేశారు. దీంతో విసుగు చెందిన మృతుడు రామకృష్ణ కుమారుడు సాయినాధ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

బీమా డబ్బుల కోసం రూ.5 వేలు ఇచ్చేలా అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు రూ. 5 వేలను అసిస్టెంట్ లేబర్ అధికారి పి.శ్రీనివాసరావు, జూనియర్ అస్టెంట్ శివ వెంకట కృష్ణలకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు రఘు, వెంకట్ రెడ్‌హ్యాండెడ్‌ పట్టుకున్నారు. నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ మీడియాకు తెలిపారు.