ప్లాస్టిక్‌ కవర్లను వినియోగిస్తే జరిమానా : కమిషనర్‌ గోపీ

సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ను వినియోగిస్తే జరిమానా తప్పదని నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ కొలన్‌ నీలాగోపాల్‌రెడ్డి, కమిషనర్‌ గోపీ తెలిపారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ప్లాస్టిక్‌ కవర్ల వాడకంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని భవ్యాస్‌నందం నుంచి హనుమాన్‌ దేవాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో వారు పాల్గొని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణ సముదాయాల యజమానులు, వినియోగదారులకు సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కవర్ల నుంచి కలిగే దుష్పరిణామాల గురించి వివరించారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం ఉన్నందున దీనిని ఎవరైన విక్రయించినా, కొనుగోలు చేసినా, వినియోగించినా రూ.5వేలు జరిమానా చెల్లించక తప్పదని హెచ్చరించారు. నిజాంపేటను ప్లాస్టిక్‌ రహితంగా మార్చేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణకు జ్యూట్‌ బ్యాగులు (చేతిసంచులు) వినియోగించాలన్నారు. ఈ సందర్భంగా పలు దుకాణాల్లో ఉన్న ప్లాస్టిక్‌ బ్యాగుల నాణ్యతాప్రమాణాలను పరీక్షించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బందితో పాటు సీనియర్‌ టీఆర్‌ఎస్‌ నాయకుడు కొలన్‌గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.