చెర్వుగట్టులో వైభవంగా శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి కల్యాణోత్సవం

నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టులో శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుద్ధమాఘ సప్తమి ముహూర్తాన స్వామివారి కల్యాణోత్సవం వీనులవిందుగా జరిగింది. అనంతరం స్వామి అమ్మవార్లను అర్చకులు ఆలయ వీధుల్లో ఊరేగించారు. షోడశస్తంభశిలా కల్యాణ మండపంలో కల్యాణ మహోత్సవం నిర్వహించారు. కల్యాణ మండప ప్రాంగణాన్ని విద్యుద్ధీపాలతో అలంకరించారు. కల్యాణోత్సవానికి భక్తులు పెద్దెత్తున తరలివచ్చారు. దీంతో కల్యాణం తిలకించేందుకు గట్టు కింద, పైన పది ఎల్‌ఈడీలను ఏర్పాటు చేశారు. శివనామస్మరణ, భక్తజన సందోహంతో చెర్వుగట్టు కిక్కిరిసిపోయింది. ఇవాళ సాయంత్రం చెర్వుగట్టు కోనేరులో తెప్పోత్సవం నిర్వహించనున్నారు. రేపు తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహిస్తారు. ఈనెల 24 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి.