పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిధిలోని పరిశ్రమల్లో ఇక నుంచి కంప్యూటరైజ్డ్ ఆకస్మిక తనిఖీలను పక్కాగా చేపట్టేందుకు పీసీబీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి నెలలో సుమారు 94 భారీ, అతిభారీ పరిశ్రమల్లో తనిఖీలు చేసేందుకు పీసీబీ ఉన్నతాధికారులు షెడ్యూల్‌ను విడుదల చేశారు. గతంలోను కంప్యూటరైజ్డ్ తనిఖీలు జరిగేవి. కానీ గతంలో కరోనా ఎఫెక్ట్‌తో ఈ తనిఖీలు మందకొండిగా సాగాయి. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గడంతో పాటు రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు పూర్తిస్థాయిలో ఉత్పత్తిని కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పరిశ్రమలపై నిఘా పెట్టిన పీసీబీ ఒక జిల్లాలోని అధికారులతో మరో జిల్లాలోని పరిశ్రమలలో తనిఖీలు చేయిస్తున్నారు. తనిఖీ అధికారులు సేకరించిన నమూనాలను పీసీబీ ప్రత్యేక ల్యాబ్‌లో పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పరిశ్రమలపై కొరఢా ఝులిపించేందుకు పీసీబీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
