కీసర గుట్ట రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : మేడ్చల్‌ ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్వేతామహంతి

కీసర గుట్ట రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, భక్తులకు ఇబ్బందుల్లేకుండా సౌకర్యాలు కల్పించాలని మేడ్చల్‌ ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్వేతామహంతి అధికారులను ఆదేశించారు. మార్చి 9 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలు, జాతర ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్‌ సమావేశపు హాల్‌లో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాశివరాత్రి పురస్కరించుకొని కీసరగుట్టకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. దివ్యాంగులకు ప్రత్యేక క్యూ లైన్‌ సౌకర్యం కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు విద్యాసాగర్‌, శ్యాంసన్‌, డీఆర్వో లింగ్యానాయక్‌, డీపీవో పద్మజారాణి తదితరులు పాల్గొన్నారు.