జాతీయ అటవీ, పర్యావరణ అభివృద్ధి బోర్డు (ఎన్‌ఏఈబీ) సభ్యుడిగా మంకెన శ్రీనివాస్‌రెడ్డి

ప్రతిష్ఠాత్మక జాతీయ అటవీ, పర్యావరణ అభివృద్ధి బోర్డు (ఎన్‌ఏఈబీ) సభ్యుడిగా హైదరాబాద్‌కు చెందిన మంకెన శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. వ్యవసాయం, సంక్షేమం, పర్యావరణం, సూక్ష్మ రుణ రంగాలలో విశేష అనుభవం కలిగిన ఆయనను కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ ఎన్‌ఏఈబీ సభ్యుడిగా నియమించింది. శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఉత్తరాఖండ్‌ నుంచి జగత్‌సింగ్‌ జంగ్లీ, జార్ఖండ్‌కు చెందిన స్వచ్ఛందసంస్థ వికాస్‌భారతి సభ్యుడు బిషున్‌పూర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లోని డీడమ్‌ స్వచ్ఛందసంస్థకు చెందిన గ్రామియమ్‌, ఢిల్లీ కేంద్రంగా పనిచేసే  ఐఎస్‌ఆర్‌ఎన్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి పోపట్‌రావు బాగూజీ పవార్‌లను కూడా సభ్యులుగా నియమించింది. శ్రీనివాస్‌రెడ్డి 1983 నుంచి ప్రజాజీవితంలో ఉన్నారు. పలు ప్రభుత్వ కమిటీల్లో, ప్యానల్స్‌లో సభ్యుడిగా పనిచేశారు. 2016 నుంచి కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కౌన్సిల్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ పీపుల్స్‌ యాక్షన్‌ అండ్‌ రూరల్‌ టెక్నాలజీ (కపార్ట్‌) జనరల్‌ బాడీ సభ్యుడిగా, జాతీయ అటవీ పరిశోధనా మండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు.