నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం

టీటీడీ ధర్మకర్తలి మండల సమావేశం తిరుమల అన్నమయ్య భవనంలో చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యతన శనివారం జరుగనుంది. ఈ సందర్భంగా సుమారు 80 అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి  వార్షిక బడ్జెట్‌ రూ.3,309.89 కోట్ల అంచనాలతో ప్రవేశపెట్టిన విషయం విధితమే. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆలయంలో భక్తులకు ప్రవేశం నిలిపి వేసిన విషయం తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున ఆదాయం తగ్గింది. ఈక్రమంలో బడ్జెట్‌ సవరణ, ఆర్జిత సేవల నిర్వహణ, సేవల్లో భక్తులకు అనుమతి, కల్యాణమస్తు కార్యక్రమం నిర్వహించాల్సిన వేదికల, పౌరోహిత సంఘానికి చెందిన పురోహితులను సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతించే విషయంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఒకే ప్రాంతంలో గదుల కేటాయింపు, తిరుమల నిర్వాసితులకు ఉద్యోగాలు పర్మినెంట్‌ చేసే అంశంపైనా తీర్మానం, ఎజెండాలో చేర్చిన మరికొన్ని అంశాలపైనా చర్చించి, తీర్మానించనున్నారు.