తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. న్యాయవాదులు వామన్రావు ఆయన సతీమణి నాగమణి హత్యకు వాడిన కత్తులను సోమవారం సుందిళ్ల పార్వతీ బ్యారేజీ నుంచి పోలీసులు వెలికితీయించారు. న్యాయవాద దంపతులను హత్య చేసిన అనంతరం కత్తులు, దుస్తులను సుందిళ్ల బ్యారేజీలోని 59-60 పిల్లర్ల మధ్య పడేసినట్లు విచారణలో నిందితులు తెలిపారు. ఈ నేపథ్యంలో వాటిని వెలికితీసేందుకు పోలీసులు ఆదివారం విశాఖకు చెందిన గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు. నిన్న చీకటిపడేంత వరకు ప్రయత్నించినా ఆయుధాలు లభ్యం కాలేదు. దీంతో సోమవారం ఉదయం నుంచి గజ ఈతగాళ్లు, అయస్కాంతాల సాయంతో గాలింపు కొనసాగించారు. సాయంత్రానికి కత్తులు, దుస్తులను గజ ఈతగాళ్లు బ్యారేజీ నుంచి వెలికితీశారు.
