తెలంగాణ రాష్ట్రంలో జంతు-జనజీవన ఘర్షణను తగ్గించే చర్యలపై సూచనలు చేయటానికి రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చైర్‌పర్సన్‌గా పదిమంది సభ్యులతో రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీలో రాజ్యసభ సభ్యుడు, అసెంబ్లీ మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, అటవీ, పర్యావరణశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, మాజీ ఎమ్మెల్యే జీ అరవింద్‌రెడ్డి, వరల్డ్‌వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యుడబ్ల్యుఎఫ్) హైదరాబాద్ చైర్మన్ అనిల్ ఏపూరు, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ కార్యదర్శి ఇమ్రాన్ సిద్దిఖీ, వెటర్నరీ వైద్య నిపుణుడు డాక్టర్ నవీన్‌కుమార్, ఎస్‌బీడబ్ల్యుఎల్ సభ్యుడు రాజీవ్ మాథ్యూ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర అటవీశాఖ అధిపతి, పీసీసీఎఫ్ ఆర్ శోభ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
మూడు నెలల్లో నివేదిక
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కవ్వాల్ అభయారణ్యంలో మనుషులపై పెద్దపులుల దాడులతోపాటు కొన్ని ప్రాంతాల్లో మనుషులు, వన్యప్రాణుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తిన ఘటనలు చోటుచేసుకుంటున్న క్రమంలో ఈ కమిటీ వేశారు. వన్యప్రాణులు జనావాసాల్లోకి రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రజలు వన్యప్రాణుల స్థావరాలను దెబ్బతీయకుండా ఏ విధమైన వాతావరణం కల్పించాలి? క్రూర మృగాల దాడిలో చనిపోయినవారి కుటుంబాలను ఆదుకోవడానికి ఏంచేయాలి? గాయపడ్డ మనుషులకు, పశువులకు ప్రస్తుతం ఇస్తున్న నష్టపరిహారం సరిపోతుందా? లేక పోతే ఎంతవరకు పెంచితే బాగుంటుంది? అనే అంశాలపై ఈ కమిటీ మూడు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది.