తెలంగాణ వ్యాప్తంగా నగరాలు, పట్టణాలకు చేరువలో ఉన్న అటవీ బ్లాకులను అభివృద్ధి చేసి అర్బన్ పార్కులుగా, లంగ్ స్పేస్ కేంద్రాలుగా అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఖానాపూర్ పట్టణానికి సమీపంలో మస్కాపూర్ బీట్‌లో హరితవనం (అర్బన్ ఫారెస్ట్ ) పార్క్ ఏర్పాటుకు మంత్ర భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మావల, నిర్మల్, అసిఫాబాద్ పట్టణాలకు సమీపంలో ఇప్పటికే ప్రారంభమైన అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో సెలవు రోజుల్లో ప్రజలు ప్రశాంతంగా గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. ఖానాపూర్‌లో 225 హెక్టార్లలో రూ.8.50 కోట్ల వ్యయంతో అర్బన్ ఫారెస్ట్ పార్కును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్, జడ్పీ చైర్ పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి రెడ్డి, పీసీసీఎఫ్ ఆర్. శోభ, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ వినోద్‌కుమార్, ఎఫ్‌డీవో, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.