తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల సంక్షేమ నిధికి 17.50 కోట్లు విడుదల

తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల సంక్షేమ నిధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.17.50 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ.100 కోట్ల కార్పస్‌ ఫండ్‌ను విడుదల చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇంతకుముందు రూ.34.50 కోట్లు విడుదల చేసింది. గురువారం మరో రూ.17.50 కోట్లు జమయ్యాయని అల్లం నారాయణ తెలిపారు. ఈ నిధులతో జర్నలిస్టులకు మరింత ఉపయోగపడేలా సంక్షేమ కార్యక్రమాలు రూపొందించే అవకాశం ఉంటుందన్నారు. జర్నలిస్టుల వెంటే ఉంటూ, నిధులు రాబట్టేందుకు కృషి చేసిన ఆందోళ్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపారు. మంత్రి కేటీఆర్‌తో బుధవారం సమావేశమైన సందర్భంగా జర్నలిస్టుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగానే సానుకూలంగా స్పందించి నిధులు విడుదల చేయించారని తెలిపారు.