సంగారెడ్డి జిల్లాలో ఉన్న అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. హత్నూర మండలం గుండ్లమాచునూర్‌లో ఉన్న అరబిందో ఫార్మా తొమ్మిదో యూనిట్‌లో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. క్రమంగా అవి విస్తరించడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు, కార్మికుల సమాచారం ప్రకారం.. పరిశ్రమలోని కాలం బ్లాక్ వద్ద రాత్రి 12 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు షార్ట్‌సర్క్యూట్ జరిగింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. దీంతో విధుల్లో ఉన్న కార్మికులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. పరిశ్రమకు సంబంధించిన ఫైరింజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదని స్థానికులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.
