అటవీశాఖలో అతివల ప్రాధాన్యం హర్షణీయం : కేంద్ర మంత్రి జవదేకర్‌

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసుల్లో మహిళలు వివిధ స్థానాల్లో విజయవంతంగా రాణిస్తున్నారని కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. దేశంలో మూడు రాష్ర్టాల్లో పీసీసీఎఫ్‌లుగా మహిళలే ఉన్నారని, వారిలో తెలంగాణ పీసీసీఎఫ్‌ ఆర్‌ శోభ ఒకరని కొనియాడారు. మహి ళా దినోత్సవం సందర్భంగా సోమవారం ఆయన ‘గ్రీన్‌ క్వీన్స్‌ ఆఫ్‌ ఇండియా -నేషన్స్‌ ఫ్రైడ్‌’ అనే పుస్తకాన్ని ఢిల్లీ నుంచి ఆన్‌లైన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ రాష్ర్టాల మహిళా ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 284 మంది మహిళలు ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసులలో వివిధ స్థానాలలో రాణిస్తున్నారని ప్రశంసించారు. హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో సోమవారం మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. వేడుకల్లో అటవీశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జాయింట్‌ సెక్రటరీ ప్రశాంతి, పీసీసీఎఫ్‌ ఆర్‌ శోభ తదితరులు పాల్గొన్నారు.