ఏపీలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌

ఏపీలో నగరపాలిక, మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఒకటి రెండుచోట్ల చెదురుమదురు ఘటనల మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రక్రియ సజావుగా జరిగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా మధ్యాహ్నం 12 గంటల వరకు మందకొడిగా సాగింది. ఆ తరువాత పోలింగ్‌ కాస్త ఊపందుకుంది. మధ్యాహ్నం ఒంటివరకు 12 జిల్లాల్లో 45 శాతం లోపే పోలింగ్‌ నమోదైంది. ఒక్క ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 53 శాతంగా జరిగింది. 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 53.57 శాతం నమోదైంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగిసినా చాలా పోలింగ్‌ బూతుల్లో  ఓటర్లు ఓటు వేసేందుకు బారులుదీరారు.

మొత్తం పోలింగ్‌ శాతంపై కాసేపట్లో స్పష్టత రానుంది. బుధవారం రాష్ట్రంలోని 71 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. 71 మున్సిపాలిటీల్లో 1633 వార్డులు.. 12 కార్పొరేషన్లలోని 581 డివిజన్లకు పోలింగ్‌ జరిగింది. ఇప్పటికే మాచర్ల, పుంగనూరు, పిడుగురాళ్ల, పులివెందుల మున్సిపాలిటీలను అధికార వైసీపీ ఏకగ్రీవం చేసుకొని తన ఖాతాలో వేసుకుంది. మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం కోసం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ తీవ్రంగా కృషిచేశాయి. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బ్యాక్సుల్లో నిక్షప్తమైంది. ఈ నెల 14న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.