ప్రభుత్వ ఈఎన్టీ దవాఖానలో ఇవాళ, రేపు శస్త్ర చికిత్సల సదస్సు నిర్వహిస్తున్నట్లు ఈఎన్టీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, చెవి, ముక్కు, గొంతు వ్యాధుల సమాఖ్య హైదరాబాద్ విభాగం అధ్యక్షుడు డాక్టర్ ఆనందాచార్య, కార్యదర్శి డాక్టర్ ఎ.నాగరాజు, కోశాధికారి డాక్టర్ ఎస్.హమీద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం దవాఖానలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సమాఖ్య, ప్రభుత్వ ఈఎన్టీ దవాఖాన సంయుక్తాధ్వర్యంలో స్వరపేటిక, అందునుంచి కింది శ్వాస నాళము పుట్టుకతో గానీ లేక ప్రమాదవశాత్తు కుచించుకుపోయి శ్వాస తీసుకోవడం కష్టమై పలు రకాల గొట్టాలపై శ్వాస తీసుకునేందుకు ఆధారపడిన రోగులకు శస్త్ర చికిత్సలు నిర్వహించబడుతాయన్నారు. కాగా, ఈ సదస్సుకు కేరళ రాష్ట్రం తిరువనంతపురం నుంచి డాక్టర్ జయకుమార్ మీనన్ విచ్చేసి శస్త్ర చికిత్సలు జరిపి క్లుప్తంగా వివరించనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సదస్సులో సుమారు వంద మంది వైద్య నిపుణుల తోపాటు పీజీ విద్యార్థులు హాజరవుతున్నట్లు వారు తెలిపారు. తదనంతరం జరిగే వైద్య విజ్ఞాన చర్చల్లో పాల్గొంటారన్నారు. ఈ అవకాశాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధానంగా శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు పడి వివిధ రకాల గొట్టాలను వాడుతున్న వారు శస్త్ర చికిత్సల సదస్సుకు హాజరుకావాలని పిలుపునిచ్చారు.