కబడ్డీ స్టేడియం గ్యాలరీ కూలి పలువురికి గాయాలు

సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన 47 జాతీయ జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. క్రీడాకారులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలడంతో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో సుమారు 2 వేల మంది గ్యాలరీ కూర్చున్నట్లు సమాచారం. సామర్థ్యానికి మించి ప్రేక్షకులు గ్యాలరీలో కూర్చున్న కారణంగానే కూలినట్లు తెలుస్తున్నది.

క్రీడాపోటీలను వీక్షించేందుకు స్టేడియంలో మూడు గ్యాలరీలను ఏర్పాటు చేశారు. పోటీల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు వచ్చారు. మరికాసేపట్లో పోటీలు ప్రారంభకానుండగా ఊహించని ఘటన జరగడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. క్షతగాత్రులను 108 సిబ్బంది, పోలీసులు, స్థానికులు అందుబాటులో ఉన్న వాహనాల్లో హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీప దవాఖానలకు తరలించారు. బాధితులను పరామర్శించేందుకు మంత్రి జగదీశ్‌ రెడ్డి సూర్యాపేట ఏరియా దవాఖానకు వెళ్లారు.