రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ఆరుగురికి తీవ్రగాయాలు

రసాయన పరిశ్రమలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి ఆరుగురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో సోమవారం ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పారిశ్రామికవాడలోని అమరల్యాబ్‌లో ఆదివారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు రియాక్టర్‌ పేలి అగ్నిప్రమాదం జరిగింది. అక్కడే పనిచేస్తున్న ఆరుగురు కార్మికులకు మంటలు అంటుకొని తీవ్రగాయాలయ్యాయి.

గుట్టుచప్పుడు కాకుండా యాజమాన్యం బాధితులను చికిత్స నిమిత్తం కూకట్‌పల్లిలోని ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు. పరిశ్రమలో ఎలాంటి రక్షణ వ్యవస్థ లేకపోవడంతోనే మంటలు వ్యాపించి కార్మికులు గాయపడినట్లు తెలిసింది. అనుమతుల విషయంలో సేఫ్టీ అధికారులు నిర్లక్ష్యం వహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.