ఫిబ్రవరి చివరిలోగా రాష్ట్ర బడ్జెట్‌

వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించిన బడ్జెట్‌ రూపకల్పనకు రాష్ట్ర ఆర్థికశాఖ కసరత్తును వేగవంతం చేసింది. తెలంగాణ చట్టసభల్లో వచ్చేనెల మూడోవారం లేదా చివరివారంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తున్న ఆర్థికశాఖ.. ఫిబ్రవరి రెండో వారంలోగా బడ్జెట్‌కు తుదిరూపమిచ్చేందుకు కృషిచేస్తున్నది. ప్రస్తుతం బడ్జెట్‌ ప్రతిపాదనలకు సంబంధించిన అంచనాలను సిద్ధంచేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం వచ్చేనెల 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.
ఆ తర్వాత కొన్ని రోజులకే తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్న రాష్ట్ర ఆర్థికశాఖ.. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యంతోపాటు జీఎస్డీపీ స్థితిగతులను పరిగణనలోకి తీసుకొని ప్రతిపాదనలను సిద్ధంచేస్తున్నది. ప్రస్తుత సంవత్సరం మాదిరిగానే భారీ అంచనాలకు పోకుండా వాస్తవిక అంచనాలతో తదుపరి బడ్జెట్‌ను రూపొందిస్తున్నట్టు తెలుస్తున్నది. తెలంగాణలో జీఎస్డీపీ వృద్ధిరేటు స్థిరంగా ఉన్నప్పటికీ గత ఏడాదిన్నర కాలం నుంచి దేశ జీడీపీ వేగంగా పడిపోతుండటం రాష్ర్టాన్ని కూడా ఆలోచనలో పడవేసింది.
దేశంలో అన్ని రంగాల్లో రాబడులు తగ్గిపోవడంతో ప్రతి మూడు నెలలకు జీడీపీ వృద్ధిరేటు ఆందోళనకర స్థాయిలో క్షీణిస్తున్నది. ఆ ప్రభావం రాష్ట్రంపై కూడా పడుతున్నది. కేంద్రం తన మొత్తం రాబడిలో 42 శాతాన్ని రాష్ర్టాలకు పంచుతున్నది. అందులో తెలంగాణకు 3.482 శాతం ఇస్తున్నది. ప్రస్తుతం కేంద్రం రాబడి బాగా తగ్గుతున్నందున రాష్ర్టాలకు వచ్చే వాటా పడిపోతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.1.82 లక్షల కోట్లతో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. పూర్తిస్థాయి బడ్జెట్‌ను రూ.1,45,492.30 కోట్లకు (20 శాతం) తగ్గించడానికి ఇదే కారణం.