తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ కరోనా పాజిటివ్‌

తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మంగళవారం ప్రకటించారు. తాజాగా చేసుకున్న పరీక్షల్లో పాజిటివ్‌ తేలిందని తెలిపారు. కొంత అస్వస్థతకు గురి కాగా పరీక్షలు చేయించుకున్నానని.. పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. అయితే కరోనా లక్షణాలు ఎలాంటివి లేవని సోమేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తనను ఇటీవల కలిసిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని.. పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

పాజిటివ్‌ ప్రకటన రాకముందు మంగళవారం సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి పలు ఆదేశాలు జారీ చేశారు. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కూడా భేటీ అయినట్లు తెలుస్తోంది. సీఎస్‌కు కరోనా సోకడంతో కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు రెండు వేలకు చేరువగా కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి.