యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం అంతెమ్మగూడెం గ్రామంలోని హజెలో ఫార్మా కంపెనీ నుంచి వెలువడుతున్న కాలుష్యం, తీసుకున్న చర్యలపై నివేదిక అందించాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)ని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది. ఈ మేరకు అంతెమ్మగూడెం గ్రామస్తులు దాఖలు చేసిన పిటిషన్పై ఎన్జీటీ న్యాయ సభ్యుడు జస్టిస్ కే రామకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్లో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ల తరపున న్యాయవాది కే శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ… ఈ ఫార్మా కంపెనీ నుంచి పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడుతోందని, అనుమతులు లేకుండా కంపెనీని విస్తరించడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని వివరించారు. ఆ కంపెనీ నుంచి పసుపుపచ్చ రంగులో వాయువు విడుదలవుతోందన్నారు. దాని వల్ల ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని, పంటలపై ప్రభావం పడటమేకాకుండా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని తెలిపారు. ఎన్జీటీ, సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు పటాన్చెరులోని ఫార్మా కంపెనీలు పోచంపల్లి, చౌటుప్పల్ ప్రాంతానికి తరలివచ్చాయని, కొన్ని పోలెపల్లి ప్రాంతంలో ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
