తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుతున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయించింది. అలాగే ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైరస్ తీవ్రత వేళ రాష్ట్రంలో కూడా పరీక్షలను రద్దు చేసేందుకే ప్రభుత్వం మొగ్గు చూపింది.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు5.35లక్షల మంది పదోతరగతి విద్యార్థులు ఉన్నారు. వీరందరినీ కూడా పైతరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. విషయానికి సంబంధించిన దస్త్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విద్యాశాఖ మంత్రి పంపించినట్లు తెలుస్తోంది. ఈ ఫైల్‌పై ముఖ్యమంత్రి సంతకం చేసినట్లు సమాచారం. ఇక కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు మూతపడిన విషయం తెలిసిందే.