తెలంగాణ మాజీ మంత్రి చందూలాల్‌ కన్నుమూత

మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్‌ (67) కన్నుమూశారు. కొంతకాలం కిందట కిడ్నీలు విఫలమవగా, మార్పిడి చేసినా ఆరోగ్యం కుదుటపడలేదు. అప్పటి నుంచి డయాలసిస్‌పైనే ఆధారపడుతున్నారు. పది రోజుల కిందట వరకు బాగానే ఉన్నప్పటికీ, ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం రాత్రి 11 గంటలకు మృతి చెందారు. ప్రస్తుత ములుగు జిల్లా జగ్గన్నపేటలో 17 ఆగస్టు 1954న జన్మించిన ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా పలుమార్లు గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాల్లో పదవులు నిర్వర్తించారు. చందూలాల్‌కు భార్య శారద, కుమారుడు ప్రహ్లాద్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.