ప్రభుత్వ దవాఖానల్లో పడకల కొరత లేదు : మంత్రి ఈటల రాజేందర్

కరోనా రోగులకు చికిత్సనందించే ప్రభుత్వ దవాఖానల్లో పడకల కొరత లేదని మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 60వేల పడకలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఆదివారం బీఆర్‌కే భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.

కరోనా తగ్గిందనుకున్న సమయంలో రెండో వేవ్‌ మొదలైందని అన్నారు. సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ బారినపడిన వారిలో 5 శాతం మందిలో మాత్రమే లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘‘45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి, ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు 100 శాతం టీకాలు పంపిణీ చేస్తాం.

ప్రతి పీహెచ్‌సీలో వ్యాక్సిన్‌ అందుబాటులో ఉండేలా చూస్తాం. ప్రస్తుతం రోజుకు లక్షన్నర మందికి వ్యాక్సిన్‌ ఇస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి రోజుకు 10 లక్షల మందికి టీకా వేసే సామర్థ్యం ఉంది. రాష్ట్రంలో వ్యాక్సిన్‌ కొరత సమస్యను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ దృష్టికి తీసుకెళ్లాం.

వ్యాక్సిన్‌ కొరత కారణంగానే ఇవాళ పంపిణీ నిలిచిపోయింది. రాత్రి కల్లా 2.7 లక్షల డోసులు రాష్ట్రానికి రావచ్చని భావిస్తున్నాం. టీకా నిల్వలపై రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్నందున ఆక్సిజన్‌ సరఫరా విషయంపైనా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. రాష్ట్రంలో నిత్యం 200 టన్నుల ఆక్సిజన్‌ అవసరం ఉంటుంది. కేసులు పెరిగితే 350 టన్నుల వరకు అవసరం ఉండొచ్చు.

ఆక్సిజన్‌ సరఫరా విషయం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేదు. ప్రైవేట్‌, ప్రభుత్వ దవాఖానల వైద్యులు కరోనా రోగులకు ఐసీఎంఆర్‌ విధి విధానాలకు అనుగుణంగా వైద్యం అందించాలి.

రోగి పరిస్థితి, అవసరాన్ని బట్టి ఆక్సీజన్‌ అందించాలి.. ఆక్సీజన్‌ కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత సైతం వైద్యులపై ఉంది. ఆక్సిజన్‌ అవసరం మేరకు వాడుకోవాలి. కరోనా ఉధృతి తగ్గిన తర్వాత రెమిడెసివీర్‌ ఇంజెక్షన్ల ఉత్పత్తి తగ్గింది. త్వరలో కావాల్సినన్ని రెమిడెసివర్‌ ఇంజెక్షన్లు లభిస్తాయి’ అని మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *