
ఫిబ్రవరి 1 నుండి 6వ తేదీ వరకు నిర్వహించనున్న చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రణాళికబద్ధంగా ఏర్పాటుచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా సకల సౌకర్యాలు కల్పిస్తూ విజయవంతం చేయాలని ఇన్చార్జి కలెక్టర్ వి.చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాటుపై జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. స్వామివారిని దర్శనం చేసుకొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం వివిధశాఖల జిల్లా అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయాశాఖల అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలు పారదర్శకంగా నిర్వహిస్తూ దైవ సన్నిధిలో సేవాభావంతో భక్తులకు సేవలు అందించాలని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దూరప్రాంతాల నుంచి భక్తులు వాహనాలపై వస్తారు కనుక ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్‌కు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేలా ఏర్పాట్లను పర్యవేక్షించాలని డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డికి సూచించారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో ప్లాస్టిక్‌ను నిషేధించి పర్యావరణ పరిరక్షణకై భక్తులకు ప్లాస్టిక్ వాడవద్దని తెలిసిసేలా చేయాలన్నారు. దేవాలయ పరిసర ప్రాంతాలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా దేవాలయ ప్రాశస్త్యం గురించి ఇతర ప్రాంతాలవారికి తెలిసేలా వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయాలని ఈఓ సులోచనకు సూచించారు. ముఖ్యంగా పారిశుద్య నిర్వహణకై గుట్టపైన కింద ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటుచేయాలన్నారు.
బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలంటే ప్రతీఒక్కరికి ప్రణాళికబద్దంగా కమ్యూనికేషన్ ఎప్పటికప్పుడు ఉండాలని అందుకు అధికారులు, సిబ్బంది ఫోన్నెంబర్లును ముద్రించి పంపిణీ చేయాలన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు లక్షల్లో భక్తులు వస్తారు కనుక భక్తులకు ఇబ్బందులు కలిగించవద్దని అన్నారు. భక్తులు విశ్రాంతి తీసుకునే గెస్ట్ హౌజ్, సత్రాల నిర్వహణకు ప్రవేటు వ్యక్తులకు అప్పగించినైట్లెతే పారిశుధ్యం మెరుగుపడుద్దని అందుకు టెండర్ ద్వారా పిలిచి అప్పగించాలన్నారు. దేవాలయ పరిసర ప్రాంతాల్లో కృత్రిమరంగులతో తయారుచేసిన ఆహారపదార్థాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది గుట్టకింద దుకాణాలను వెనుకకు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ దేవాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ బ్రహ్మోత్సావాలను విజయవంతం చేయాలన్నారు. దూరప్రాంతాల నుంచి భక్తులకు అధిక సంఖ్యలో వస్తారు కనుక ఇప్పటినుండే ప్రచారం ముమ్మరం చేయాలని ఈఓ, సూపరిండెంట్ సమన్వయంతో ఉంటూ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ పనులు నిర్వహించాలన్నారు. అనంతరం బ్రహ్మోత్సవాల గోడ పత్రిక, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్వర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వై.శేఖర్‌రెడ్డి, డీపీఓ విష్ణువర్థన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కొండల్రావు, జిల్లా సహకార అధికారి శ్రీనివాసమూర్తి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి గూడ వెంకటేశ్వర్లు, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, సర్పంచ్ మల్గ బాలక్రిష్ణ, ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి, ఎంపీడీఓ సాంబశివరావు, తాసిల్దార్ రాధ, ఎస్సై దాచెపల్లి విజయ్‌కుమార్, సంబంధిత జిల్లా అధికారులు దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.