పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి గెలుపొందారు. మమతా బెనర్జీపై 1,736 ఓట్ల తేడాతో సువేందు విజయం సాధించారు. మొదటి రౌండ్ నుండి ఇరువురి మధ్య పోరు హోరాహోరీగా కొనసాగింది. రౌండు రౌండుకి ఆధిక్యాలు మారి తీవ్ర ఉత్కంఠను రేపాయి. చివరకు విజయం సువేందు అధికారిని వరించింది.
మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. నందిగ్రాంలో తీర్పును అంగీకరిస్తున్నట్లు తెలిపారు. నందిగ్రామ్ ప్రజలు ఏ తీర్పు అయినా ఇవ్వనీ. దానిని నేను అంగీకరిస్తాను. ఇది పెద్ద విషయం కాదు. నేనేమీ పట్టించుకోను. చింతించకండని పార్టీ శ్రేణులనుద్దేశించి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని గెలిచినట్లు ఆమె పేర్కొన్నారు. నందిగ్రామ్ కోసం లెక్కింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని దయచేసి ఫలితాలు వెల్లడించవద్దని తృణమూల్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే సువేందు అధికారి 1,736 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.