వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలతో పాటు అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు ఈ నెల 7న మధ్యాహ్నం 3.30 గంటలకు నిర్వహించనున్నారు. పరోక్ష పద్ధతిలో జరగనున్న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం జారీ చేసింది. జిల్లా కలెక్టర్లు నియమించిన గెజిటెడ్ అధికారి ప్రిసైడింగ్ అధికారిగా ఉంటారు. ఆయన ఈ పదవులకు ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక సమావేశానికి పిలుపునిస్తూ ఈ నెల 6న లేదా అంతకంటే ముందే నోటీసు జారీ చేస్తారు. 7న మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తొలుత వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం 3.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్‌పర్సన్, డిప్యూటీ చైర్‌పర్సన్ల ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికైన వార్డు మెంబర్లు, ఎక్స్– అఫీషియో సభ్యులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోకసభ, రాజ్యసభ సభ్యులు ఓటేయడానికి అర్హులు. ఓటు హక్కు ఉన్న సభ్యుల్లో సగం సంఖ్యను ’కోరం’గా పరిగణిస్తారు. మొదటి రోజు కోరం లేక ఎన్నిక నిర్వహించలేని పక్షంలో మరుసటి రోజు ఎన్నిక నిర్వహించాలి. రెండో రోజు లేదంటే ఆ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలి.
