కడప పేలుడు ఘటన.. ఉన్నతస్థాయి కమిటీతో విచారణకు ప్రభుత్వం ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో పేలుడు ఘటనను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తూ 5 ప్రభుత్వశాఖలతో ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.

5 రోజుల్లో విచారణ పూర్తిచేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విచారణ కమిటీని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తక్షణ నష్టపరిహారం కింద ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు, గాయపడిన వారికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు తెలిపారు.

మామిళ్లపల్లె శివారులోని బైరటీస్‌ గనిలో శనివారం ఉదయం జిలిటెన్‌ స్టిక్స్‌ పేలిన విషయం తెలిసిందే. ముగ్గురాళ్ల గనిలో పేలుళ్లు జరిపేందుకు వేంపల్లి నుంచి కారులో జిలిటెన్‌ స్టిక్స్‌ తీసువచ్చారు.

కూలీలు వీటిని అన్‌లోడ్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించడంతో 10 మంది దుర్మరణం చెందారు. ఘటనపై ఇప్పటికే గని యజమానిపై కేసు నమోదైంది.