కడప పేలుడు ఘటనపై విచారణ ముమ్మరం : ఎస్పీ అన్బురాజన్‌

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో పేలుడు ఘటనపై విచారణను ముమ్మరం చేశామని కడప ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన కేసు దర్యాప్తులో పురోగతిని వివరించారు.

పేలుళ్లకు కారణమైన గని యజమాని నాగేశ్వర్‌రెడ్డిని, గనిలో పనిచేసే రఘునాథ్‌రెడ్డిని అరెస్టు చేశామని చెప్పారు. కారులో తీసుకువచ్చిన జలెటిన్‌ స్టిక్స్‌ను అన్‌లోడ్‌ చేసే సమయంలో పేలి 10 మంది కార్మికులు మృతి చెందినట్లు వెల్లడించారు.

పులివెందుల నుంచి పేలుడు పదార్థాలను తీసుకువచ్చినట్లు గుర్తించామన్నారు. పేలుడు సమయంలో కారులో వెయ్యికిపైగా జిలెటిన్‌ స్టిక్స్‌ ఉన్నాయి. పేలుడు పదార్థాలు తరలించేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

అనుమతి లేకుండా గనిలో తవ్వకాలు చేపడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. మరికొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు.