అగ్నిప్రమాద ఘటనలో ప్రాణనష్టమేమీ జరగలేదు : కలెక్టర్ వినయ్‌ చంద్‌

విశాఖ నగరంలోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ సంస్థ (హెచ్‌పీసీఎల్‌)లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ప్రాణనష్టమేమీ జరగలేదని ఆ జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను అరగంటలోనే అదుపులోకి తెచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రమాదం జరగ్గానే సంస్థ అధికారులు అప్రమత్తమై సైరన్‌ మోగించడంతో ఉద్యోగులంతా బయటకు రావడంతో ప్రమాదం తప్పిందన్నారు. ప్రమాదంలో ఏ ఒక్కరికీ గాయాలు కూడా కాలేదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ప్రమాదంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

హెచ్‌పీసీఎల్‌ పరిశ్రమలోని పాత టెర్నినల్‌ క్రూడ్‌ డిస్టిలేషన్‌ 3వ యూనిట్‌లో మధ్యాహ్నం 3 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు అలుముకొని చూస్తుండగానే మంటలు యూనిట్‌కు మొత్తం అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు సైరన్‌ మోగించడంతో ఉద్యోగులందరూ బయటకు వచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 20 అగ్నిమాపక వాహనాలతో గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై ఉన్నతాధికారులు విచారణ నిర్వహిస్తున్నారు.