పర్యావరణ పరిరక్షణతోనే మనుగడ: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

ప్రపంచవ్యాప్తంగా విచక్షణారహితంగా కొనసాగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని నిలువరించకపోతే కరోనా లాంటి మరెన్నో ఉపద్రవాలను చవిచూడాల్సి వస్తుందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే మానవ మనుగడ, సుస్థిర అభివృద్ధి సాధ్యమని, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఇచ్చిన సందేశంలో స్పష్టంచేశారు. ప్రకృతిని కాపాడి, భవిష్యత్‌ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వాలతోపాటు పౌరులు కూడా కలిసికట్టుగా ముందుకుసాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యత కోసం అటవీశాఖ, అటవీ అభివృద్ధి సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి తెలిపారు.