తెలంగాణలో లాక్‌డౌన్‌ మరో 10 రోజులు పొడిగింపు

తెలంగాణలో లాక్‌డౌన్‌ను మరో పది రోజుల పాటు కొనసాగించాలని మంత్రిమండలి నిర్ణయించింది.ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపు ఉంటుంది. సడలింపు సమయం తర్వాత బయటకు వెళ్లినవారు తిరిగి ఇంటికి చేరుకోవడానికి మరో గంటపాటు అంటే సాయంత్రం 6 గంటల వరకు సమయమిస్తారు.

ఆ తర్వాత నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని పోలీసు శాఖను కేబినెట్ ఆదేశించింది. కరోనా పూర్తిగా అదుపులోకి రాని.. సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాల గూడ, నియోజక వర్గాల పరిధిలో మాత్రం ఇప్పుడు కొనసాగుతున్న లాక్‌డౌన్‌ యథాతథంగా కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.