
సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్పహాడ్ దర్గా ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. మూడ్రోజుల ఉర్సులో భాగంగా తొలిరోజు దర్గాలోని హజ్రత్ సయ్యద్, మొహినుద్దీన్ షా సమాధులను పూలు, దట్టీలతో అలంకరించి కొవ్వొత్తులతో దీపారాధన చేశారు. దర్గా పూజారి ఇంటి నుంచి గంధం కలశాలు, దట్టీలను ఊరేగింపుగా దర్గాకు తీసుకురాగా.. పకీరుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. శుక్రవారం గంధోత్సవం ఊరేగింపు నిర్వహించనుండగా హోంశాఖమంత్రి మహమూద్ అలీ హాజరుకానున్నారు.
ఇవాళ గంధం ఊరేగింపు
ఉర్సు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ప్రధాన ఘట్టం గంధం ఊరేగింపు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ హాజరుకానున్నారు. అదేవిధంగా హుజుర్నగర్, మిర్యాలగూడ, కోదాడ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, నల్లమోతు భాస్కర్రావు, బొల్లం మల్లయ్యయాదవ్ హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు.
ఏర్పాట్లు పరిశీలించిన జేసీ
ఇవాళ నిర్వహించబోయే గంధం మహోత్సవ ఊరేగింపు ఏర్పాట్లను జేసీ సంజీవరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉర్సుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నేరేడుచర్ల, దామరచర్ల నుంచి వచ్చే వాహనాల ట్రాఫిక్ నియంత్రణకు, వాహనాలు నిలుపడానికి 5 ఎకరాల్లో పార్కింగ్, దర్గా వెలుపల, లోపల భక్తుల నియంత్రణకు బారికేడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శాంతి భద్రతల పరిక్షణకు సీసీకెమెరాల ఏర్పాటును పరిశీలిస్తున్నామని చెప్పారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేరేడుచర్ల, పాలకవీడు తాసిల్దార్లు రాంరెడ్డి, కృష్ణానాయక్, ఎస్ఐ నరేశ్ తదితరులు పాల్గొన్నారు.