అక్రమాస్తుల కేసులో బీజేడీ మాజీ ఎమ్మెల్యే అనమ్‌మాలిక్‌ అరెస్ట్‌

భువనేశ్వర్‌ అక్రమాస్తుల కేసులో బీజేడీ మాజీ ఎమ్మెల్యే అనమ్‌మాలిక్‌ను అవినీతినిరోధక శాఖ అధికారులు అరెస్ట్‌ చేశారు.

అక్రమాస్తుల కేసులో బీజేడీ మాజీ ఎమ్మెల్యే అనమ్‌మాలిక్‌ను అవినీతినిరోధక శాఖ అధికారులు అరెస్ట్‌ చేశారు. 2014-19 మధ్య భవానీపట్న అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన అనమ్‌మాలిక్‌ కు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు అభియోగాలు నమోదు చేశారు. ఈ మేరకు అవినీతి నిరోధక శాఖ అధికారులు అనమ్‌మాలిక్‌ను అరెస్ట్‌ చేశారు. రాష్ట్రప్రభుత్వం జీరో కరప్షన్‌ (అనినీతి నిర్మూలన) ట్యాగ్‌లైన్‌ పాలసీ పెట్టుకున్న తర్వాత విజిలెన్స్‌ అధికారులకు పట్టుబడిన మొదటి బీజేడీ నేత అనమ్‌మాలిక్‌ కావడం గమనార్హం.
జనవరి 17న ఏసీబీ అధికారులు భవానీపట్న నక్టిగూడలోని అనమ్‌మాలిక్‌ ఇంటిపై దాడులు నిర్వహించారు. మదన్‌పూర్‌-రాంపూర్‌ పట్టణంలో ఉన్న ఆయన హోటల్‌లో కూడా తనిఖీలు నిర్వహించారు. మూడు భవంతులు, డూప్లెక్స్‌ ఇళ్లు, లిక్కర్‌ షాపు, మార్కెట్‌ కాంప్లెక్స్‌, 6 ప్లాట్లు గుర్తించి సీజ్ చేశారు. వీటి విలువ రూ.3.4కోట్లపైనే ఉన్నట్లు తేలింది. బ్యాంక్‌ ఖాతాలో రూ.49 లక్షలున్నట్లు గుర్తించారు.