తెలంగాణలో కొత్తగా 710 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 710 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ గురువారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,34,605కు పెరిగింది. కొత్తగా 808 బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు 6,20,757 మంది డిశ్చార్జి అయ్యారు. 24 గంటల్లో నలుగురు బాధితులు వైరస్‌ బారినపడి మృతి చెందగా.. మృతుల సంఖ్య 3,747కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,101 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, రికవరీ రేటు 97.81శాతానికి పెరిగిందని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. మరణాల రేటు 0.59శాతంగా ఉందని తెలిపింది. ఇవాళ ఒకే రోజు 1,10,355 కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు చెప్పింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా ఖమ్మంలో 80, జీహెచ్‌ఎంసీలో 71, వరంగల్‌ అర్బన్‌లో 51, మంచిర్యాలలో 47, పెద్దపల్లిలో 46, కరీంనగర్‌లో 34, భద్రాద్రి కొత్తగూడెంలో 32 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వివరించింది.