కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర వాటా తేల్చాలి : నీటి పారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌

కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన న్యాయపరమైన వాటాను కేంద్రం తేల్చాలని నీటి పారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ కోరారు. రాష్ట్ర వాటా తేల్చే వరకు 811 టీఎంసీల్లో సగం ఇవ్వాలని పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టుల డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌ (డీపీఆర్‌) కేంద్రానికి ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. దేవాదుల, పాలమూరు, డిండి తదితర ప్రాజెక్టులన్నీ పాతవేనని రజత్‌ కుమార్‌ గుర్తు చేశారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్ర జలశక్తి శాఖ గెజిట్‌ విడుదల చేసిన నేపథ్యంలో సోమవారం ఇంజినీర్లు, న్యాయవాదులతో నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ భేటీ అయ్యారు. కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌పై అధ్యయనం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పాలన, సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై కసరత్తు చేస్తున్నట్లు రజత్‌ కుమార్‌ వెల్లడించారు.