
నల్గొండ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ను జిల్లాలోని 7 మున్సిపాలిటీ కేంద్రాలలో శనివారం నిర్వహిస్తున్నట్లు, కౌంటింగ్ ను పారదర్శకంగా ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం నిర్వహించాలని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో మున్సిపాలిటీ ప్రత్యేక అధికారులు, కమీషనర్లు, మున్సిపల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశం మరియు శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, కౌంటింగ్ సిబ్బంది ఉదయం 6 గంటలకే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని అన్నారు. ప్రతి రిటర్నింగ్ అధికారికి కేటాయించిన కౌంటింగ్ కౌంటర్ టేబుల్ వద్ద మూడు వార్డులకు కౌంటింగ్ జరుగుతుందని, ఒకవార్డు పూర్తి కౌంటింగ్ చేపట్టి, పూర్తి చేసి, ఫలితాలను ప్రకటించిన తరువాతనే తదుపరి వార్డు కౌంటింగ్ చేపట్టాలని అన్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ పత్రాల కౌంటింగ్ పూర్తి అయిన తరువాతనే ఆ వార్డుకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలలో ఉపయోగించిన బ్యాలెట్ బాక్సులలోని బ్యాలెట్ పత్రాల లెక్కింపు జరుగుతుందని అన్నారు. లెక్కింపు ప్రక్రియ రెండు దశలలో జరుగుతుందని మొదట ఒక వార్డుకు సంబంధించిన అన్ని పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన బ్యాలెట్ పత్రాల ప్రాథమిక లెక్కింపు ఒకదాని తరువాత మరొకటి చేపట్టాలని, ప్రాథమిక లెక్కింపు పూర్తి అయిన తరువాత వాటిని 25 బ్యాలెట్ పత్రాల చొప్పున బండిల్స్ ఆయన డ్రమ్ములో వేసి ఆ బండిళ్లను బాగా కలిపిన తరువాత ఒక్కో రౌండ్ కు టేబుల్ కు వెయ్యి బ్యాలెట్ పత్రాల చొప్పున వివరణాత్మక లెక్కింపు చేపట్టాలని అన్నారు. రౌండ్లవారీగా అభ్యర్ధివారీగా వచ్చిన ఓట్లను లెక్కించి, తుది ఫలితాల షీటును నింపి, సంతకం చేసి, గెలుపొందినవారి పేర్లను ప్రకటించి, ఎన్నికైన ధృవపత్రాన్ని అందజేయాలని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ మరియు సాధారణ బ్యాలెట్ పత్రాల చెల్లుబాటును ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నిర్ధారించాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో, ఫలితాల ప్రకటనలో రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని అన్నారు. ఫలితాల ప్రకటన అనంతరం అభ్యర్ధివారీగా చెల్లుబాటైన బ్యాలెట్ పేపర్లు, నోటాకు నమోదైన బ్యాలెట్ పత్రాలు, తిరస్కరించిన బ్యాలెట్ పత్రాలను కవర్లలో ఉంచి, రిటర్నింగ్ అధికారి సీలు వేయాలన్నారు. అలాగే పోలింగ్ రోజున పోలింగ్ అధికారులు సమర్పించిన చట్టపరమైన కవర్లను కూడా రిటర్నింగ్ అధికారి సీలు వేయాలని అన్నారు. తదుపరి అన్ని పత్రాలను, బ్యాలెట్ పేపర్లను జిల్లా సంబంధిత మున్సిపల్ కమీషనర్ల ద్వారా జిల్లా ట్రెజరీలో భద్రపరచాలన్నారు. కౌంటింగ్ కు సంబంధించి అన్ని అంశాలను రాష్ట్ర స్థాయి మాస్టర్ ట్రైనర్ తరాల పరమేశ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రవీంద్ర నాథ్,జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి,అర్.డి.ఓ.లు జగదీశ్వర్ రెడ్డి,రోహిత్ సింగ్, లింగ్యా నాయక్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ లు రాజ్ కుమార్,(చిట్యాల),అర్.శ్రీనివాస మూర్తి(చండూర్),నారాయణ స్వామి ( నంది కొండ),,గూడ వెంకటేశ్వర్లు(హలియా) తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.