ఎస్‌ఐతో సహా ఇద్దరు కానిస్టేబుళ్లు సర్వీస్‌ నుంచి తొలగింపు

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో సంచలనం సృష్టించిన దళిత మహిళ మరియమ్మ లాకప్‌ డెత్ కేసులో బాధ్యులపై పోలీస్‌శాఖ చర్యలు తీసుకుంది. ఈ కేసులో ఎస్ఐ మహేష్, కానిస్టేబుళ్లు ఎంఏ రషీద్, పీ.జానయ్యను సర్వీస్‌ నుంచి తొలగిస్తూ రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వీరిని ఇప్పటివరకు పోలీస్‌ శాఖ సస్పెన్షన్‌లో ఉంచింది. విచారణ అనంతరం విధుల నుంచి పూర్తిగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దొంగతనం కేసు విచారణలో భాగంగా ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడకు చెందిన అంబడిపూడి మరియమ్మతోపాటు ఆమె కుమారుడిని అడ్డగూడూరు పోలీసులు గత నెల విచారించారు. ఈ క్రమంలో పోలీస్‌ కస్టడీలో మరియమ్మ మృతి చెందింది. తల్లి, కుమారుడిని పోలీసులు చిత్రహింసలు పెట్టారని ఆరోపణలు వెల్లువెత్తడంతో అధికారులు విచారణ చేపట్టారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్‌ సైతం తీవ్రంగా స్పందించారు. మరియమ్మ కుటుంబానికి రూ. రూ. 15 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయాలని ఆదేశించారు. ఇద్దరు కుమార్తెలకు చెరో రూ. 10 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలని కూడా సీఎం సూచించారు.