తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా గణేష్ ఉత్సవాల సందర్భంగా ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేస్తుందని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ప్లాస్టరాఫ్ ప్యారిస్, రసాయన రంగులతో తయారు చేసే వినాయకులను జలాశయాల్లో నిమజ్జనం చేయడం వల్ల కాలుష్యం పెరిగిపోతుందని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్న పీసీబీ ఈ సారి కూడా ప్రజలకు వినాయకుల ప్రతిమలను పంపిణీ చేస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచి అన్ని మతాల పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకుంటున్నామన్నారు. ప్రజాప్రతినిదులు, అధికారులు, భాగ్యనగర్ ఉత్సవ కమిటీ, మండపాల నిర్వాహకులు అందరూ శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరిగేలా సహకరించాలని కోరారు. ఎలాంటి అలజడులు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. ఇండ్లలో కూడా మట్టి వినాయక విగ్రహలను ప్రతిష్టించి, పూజలు చేయాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, పూజలు నిర్వహించుకోవాలన్నారు.