రేపు తిరుమలలో గోకులాష్టమి ఆస్థానం

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. ఆలయంలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం జరుగనుంది. ఈ సందర్భంగా సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తారు. ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు.

అనంతరం ద్వాదశారాధనం చేపడతారు. అలాగే మంగళవారం తిరుమలలో ఉట్లోత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4 నుంచి 5 గంటల వర‌కు మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వ‌హిస్తారు. కాగా, ప్రతి ఏడాది తిరుమ‌లలో ఈ ఉట్లోత్సవాన్ని తిలకించడానికి మలయప్పస్వామివారు, శ్రీకృష్ణస్వామివారు తిరుచ్చిపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ హార‌తులు స్వీక‌రిస్తారు.

యువకులు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ ఉట్లోత్సవంలో పాల్గొంటారు. కానీ, కొవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు తిరుమలలో శ్రీకృష్ణ జన్మాష్టమి, ఉట్లోత్సవాల‌ను శ్రీ‌వారి ఆల‌యంలో ఈ ఏడాది ఏకాంతంగా టీటీడీ నిర్వహించనుంది. ఉట్లోత్సవం సందర్భంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే వ‌ర్చువ‌ల్ సేవ‌లైన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.