వీర‌నారి చాక‌లి ఐల‌మ్మ‌కు నివాళుల‌ర్పించిన మంత్రి ఎర్ర‌బెల్లి దయాకర్‌రావు

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ (చిట్యాల ఐల‌మ్మ‌) వర్ధంతి సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆమెకు నివాళులు అర్పించారు. పాలకుర్తిలోని ఆమె కాంస్య విగ్రహానికి పూల‌మాల వేసి వంద‌నం స‌మర్పించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఆయ‌న‌.. నిజాం పాలనకు, విసునూరు దేశ్‌ముఖ్ పాల‌న‌కు వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు.

చాక‌లి ఐలమ్మ లాంటి ఉద్యమ యోధులు త‌న‌ నియోజకవర్గానికి చెందిన వారు కావ‌డం త‌న అదృష్టంగా భావిస్తున్నాన‌ని మంత్రి ఎర్ర‌బెల్లి పేర్కొన్నారు. వారు అనాడు చేసిన ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది అయిందని, ఆ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అయ్యింద‌ని మంత్రి చెప్పారు. చాకలి ఐలమ్మ ధైర్యం, తెగువ.. ఆనాటి దేశ్‌ముఖ్‌లు, రజాకార్ల గుండెల్లో భయం పుట్టించాయ‌న్నారు. ఒకవైపు సాయుధ పోరాటం చేస్తూనే మరోవైపు అమ్మలా ఉద్యమకారులకు అన్నం పెట్టిన‌ మహనీయురాలు చాలా ఐల‌మ్మ అని మంత్రి కీర్తించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.