సమాజానికి, ప్రకృతికి మేలు చేకూర్చే అటవీ సంపదను రక్షించేందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని జూ పార్కు వద్ద స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 21 మంది అటవీ శాఖ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో అమరులయ్యారని, ఇది చాలా బాధాకరమని అన్నారు. అటవీ సంపదను కాపాడటంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని తెలిపారు.
కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అటవీ సంపదను కాపాడడంలో సిబ్బంది తమ విధులను అణుమాత్రం కూడా విస్మరించలేదన్నారు. అటవీ అధికారుల రక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, విధి నిర్వహణలో అమరులైన అటవీ అధికారులు, సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.