రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఈ విజయాన్ని గుండెల్లో పెట్టుకుంటాం : సీఎం కేసీఆర్‌

మున్సిపాలిటీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఒకే రకమైన ఫలితాన్ని ఇచ్చారు అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఒక పార్టీ, నాయకత్వం పట్ల ఇంత ఆదరణను, హవాను ఎప్పుడూ చూడలేదు. ఎంతో విశ్వాసం ఉంటే తప్ప ఈ విజయం రాదు. ఈ విజయాన్ని గుండెల్లో పెట్టుకుంటాం. ఈ గెలుపు మరింత బాధ్యతను పెంచింది. గెలుపుతో పార్టీ కార్యకర్తలకు గర్వం రావొద్దు అని సీఎం సూచించారు.
తెలంగాణ ప్రజానీకానికి ధన్యవాదాలుటీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల ఈ విజయం సాధ్యమైంది. అందరిని కలుపుకుపోతున్నాం. ఇది ప్రజలకు నచ్చింది. వెన్నుతట్టి తమను ముందుకు నడిపిస్తున్న తెలంగాణ ప్రజానీకానికి ధన్యవాదాలు. విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు. గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కేటీ రామారావుకు నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అందరూ కలిసి చక్కటి ఫలితాలు సాధించారు. ఇటువంటి ఘన విజయం సాధించడం మమూలు విషయం కాదు అని సీఎం కేసీఆర్‌ అన్నారు.
అదే హవాముందుస్తు అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలు గెలిచాం. నాడే ప్రజలు అద్భుతమైన సంకేతం ఇచ్చారు. హుజుర్‌నగర్‌ గెలుపుతో 89కి చేరింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 32 జిల్లాలకు 32 జిల్లా పరిషత్‌లు గెలిచాం. ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అదే హవా కొనసాగింది అని సీఎం పేర్కొన్నారు.
ఈ ఫలితాలు ఆల్‌ ఇండియా రికార్డ్‌ఇప్పుడు వచ్చిన మున్సిపల్‌ ఎన్నికలను ఆపాలని విశ్వప్రయత్నం చేశారు. రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. ప్రజలంతా ముక్తకంఠంతో తీర్పు ఇచ్చారు. ఇంత ఏకపక్షంగా ఫలితాలు రావడం ఆల్‌ ఇండియా రికార్డ్‌. సాధారణంగా పట్టణాల్లో ఇలాంటి ఫలితాలు రావు. ఎవరూ ఎలాంటి విమర్శలు చేసినా ప్రజలు పట్టించుకోలేదు. నిరంతరం కొన్ని కుక్కలు మోరుగుతూనే ఉన్నాయి. అవి ఎందుకు మోరుగుతున్నాయో అర్థం కావడం లేదు. ఒకరైతే ముఖ్యమంత్రి ముక్కు కోస్తానని అంటారు. అలాంటోళ్లకు ప్రజలు కొట్టిన చెంపదెబ్బ మామూలు దెబ్బ కాదు. సోషల్‌ మీడియాలో వ్యక్తిగత దూషణాలు బంద్‌ చేయకపోతే కఠినంగా వ్యవహరిస్తాం. తిట్టడానికి కూడా హద్దు, అదుపు మర్యాద, సంస్కారం ఉండాలి. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించం. సోషల్‌ మీడియానా? యాంటీ సోషల్‌ మీడియానా? అర్థం కావడం లేదు. చెంప చెల్లుమనిపించేట్లుగా జాతీయ పార్టీలకు ఫలితాలు ఉన్నాయి అని కేసీఆర్‌ తెలిపారు.
అధికార దుర్వినియోగానికి పాల్పడలేదుతానెప్పుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. చౌకబారు మాటలతో ప్రజల తీర్పును అగౌరవపరచొద్దు. నిర్మాణాత్మకమైన విమర్శలు చేయండి.. కానీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదు. విపక్షాలు కూడా కొన్ని మున్సిపాలిటీలు గెలిచాయి. మరి వాళ్లు ఎలా గెలిచారు. విపక్షాలకు ఇప్పటికే చాలా ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు. టీఆర్‌ఎస్‌ పార్టీ బాగా పని చేసినందుకే ఈ గెలుపు సాధ్యమైందన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ రూ. 80 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టింది. ఆ ఖర్చు పెట్టింది కూడా పార్టీ మెటీరియల్‌కే అని తెలిపారు. తెలియకుండానే లక్షల కోట్లు ఖర్చు పెట్టారని ఎలా అంటారు? అవాకులు, చెవాకులు మానేసి ప్రజల తీర్పును గౌరవించాలి. ఓటేసిన ప్రజలను అవమానిస్తారా? ఇతర పార్టీలకు పొలిటికల్‌ గేమ్‌.. తమకేమో టాస్క్‌ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.
త్వరలోనే పట్టణ ప్రగతిపల్లె ప్రగతి కార్యక్రమం మాదిరిగానే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని త్వరలోనే అమలు చేస్తాం. పల్లె ప్రగతి ద్వారా సాధించిన ఫలితాలను తెలంగాణ పట్టణ ప్రగతి ద్వారా పట్టణాల్లో సాధించాలి. ఈ ఎన్నికల్లో ఎన్నికైనా వారికి పట్టణాభివృద్ధిపై ప్రత్యేక శిక్షణ ఇస్తాం. పట్టణాల అభివృద్ధి, నగరీకరణలో సవాళ్లపై అవగాహన కల్పిస్తాం. ప్రజలు తమపై పెట్టుకున్న సంపూర్ణ విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. బీజింగ్‌ తర్వాత అత్యధిక కాలుష్యాన్ని ఢిల్లీ ఎదుర్కొంటుంది. హైదరాబాద్‌కు వస్తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. నగరానికి పరిశ్రమలు వస్తుంటే సంతోషంతో పాటు భయం కూడా కలుగుతోంది. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వసతులు కల్పించడం మా ముందున్న ప్రధాన సవాలు. 20 ఎకరాల్లో సెంటర్‌ ఫర్‌ అర్బన్‌ ఎక్సలెన్సీని ఏర్పాటు చేస్తాం అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.