తెలుగు అకాడమీ కేసులో పదిమంది అరెస్ట్‌ : సిటీ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌

తెలుగు అకాడమీకి సంబంధించిన నిధుల గోల్‌మాల్‌ కేసులో ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటి వరకు కేసుల్లో పదిమందిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. సెప్టెంబర్ 27న యూనియన్​ బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో మొదటి ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని, ఈ స్కామ్‌లో మూడు ఎఫ్‌ఐఆర్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సుమారు రూ.64.50కోట్లు ఎఫ్‌డీ నిధులను విత్‌డ్రా చేసినట్లు విచారణలో గుర్తించినట్లు తెలిపారు. యూబీఐ కార్వాన్‌ శాఖ నుంచి రూ.26కోట్లు, యూబీఐ సంతోష్‌నగర్‌ శాఖ నుంచి రూ.11కోట్లు, చందానగర్‌ కెనరా బ్యాంక్‌లో రూ.6కోట్లు ఎఫ్‌డీలు స్వాహా చేసినట్లు గుర్తించామని సీపీ చెప్పారు.

గతేడాది డిసెంబర్‌ నుంచి సెప్టెంబర్‌ 21 వరకు ఎఫ్‌డీల సొమ్ము కాజేశారన్నారు. స్కామ్‌లో కీలక నిందితుడు సాయికుమార్‌పై గతంలో మూడు కేసులున్నాయని, ఈ కేసులో మొత్తం ఎనిమిదిపై అనుమానాలున్నాయని పేర్కొన్నారు. నిందితుల్లో ఎక్కువ మంది ఏపీకి చెందిన వారున్నారన్నారు. సంయుక్త సీపీ అవినాష్‌ మహంతి మాట్లాడుతూ ఎఫ్‌డీఐల సొమ్ము అగ్రసేన్‌ కోఆపరేటివ్‌ సొసైటీ ఖాతాలోకి వెళ్లిందని పేర్కొన్నారు. ఏపీ మర్కంటైల్‌ బ్యాంకు పది శాతం కమిషన్‌ చేరినట్లు గుర్తించనట్లు చెప్పారు. అధిక శాతం నిధులను సాయికుమార్‌ తీసుకున్నాడని, మిగిలిన వారంతా ఒప్పందం ప్రకారం వాటాలు తీసుకున్నారని వివరించారు. వాటితో నిందితులు ఆస్తులు కొన్నారని చెప్పారు.