పద్మ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు-తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌

కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి గానూ ఆయా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌.. రాష్ట్రం నుంచి పద్మ పురాస్కారాలు పొందిన వారికి అభినందనలు తెలిపారు. పద్మభూషన్‌ అవార్డుకు ఎంపికైన పీవీ సింధు బ్యాట్మింటన్‌ క్రీడతో తెలంగాణకే కాకుండా దేశానికి కూడా గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిందని ప్రశంసించారు. సింధుకు అవార్డు రావడంతో మరింత మంది క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని ఆయన అన్నారు. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కరీంనగర్‌కు చెందిన శ్రీ భాష్యం విజయసారథికి మంత్రి కేటీఆర్‌ ఫోన్‌లో అభినందనలు తెలిపారు. విజయసారథి చేసిన సాహిత్య కృషికి దక్కిన గుర్తింపు ఇదని మంత్రి కొనియాడారు.
హైదరాబాద్‌కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట్‌రెడ్డికి సైతం మంత్రి ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ద్రాక్ష పంట సాగుతో వినూత్నమైన మెలకువలతో అద్భుతమైన వ్యవసాయ విధానాలతో గొప్ప దిగుబడులు సాధించిన వ్యక్తి వెంకట్‌రెడ్డి అని మంత్రి ప్రశంసించారు. రైతుకు పద్మశ్రీ అవార్డు దక్కడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. వీరితో పాటు పద్మ అవార్డులు పొందిన ప్రతి ఒక్కరికీ తెలంగాణ ప్రభుత్వం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.