ఏపీలో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌.. ఎల్లుండి నుంచి నామినేషన్లు

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి స్థానిక ఎన్నికల నగారా మోగింది. గతంలో నిర్వహించని కార్పొరేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. వివిధ కారణాలతో నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు 12 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. గతంలో వివిధ కారణాలతో ఈ ఎన్నికలు వాయిదా పడ్డాయి. 533 వార్డులు, 85 ఎంపీటీసీలు, 11 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. పంచాయతీలకు ఈనెల 14న, మున్సిపాలిటీలకు 15న, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు 16న ఎన్నికలు నిర్వహించనున్నారు. నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నిక ఈనెల 15న జరుగుతుంది. 17న మున్సిపాలిటీ, 18న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ దఫా ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. నెల్లూరు మున్సిపల్‌ కార్పోరేషన్‌తోపాటు గ్రేటర్‌ విశాఖలో రెండు డివిజన్‌ స్థానాలు, ఆరు మున్సిపల్‌ కార్పోరేషన్ల పరిధిలోని 10 డివిజన్లు, 12 మున్సిపాల్టీల్లోని 13 వార్డుల్లో ఎన్నికలు ఉంటాయి.